అజిత్ పవార్ కొత్త ఆఫీసు తాళాలు మిస్సింగ్ !
మహారాష్ట్ర ఎన్సీపీ రాజకీయాల్లో మంగళవారం సరికొత్త ట్విస్ట్ ! ఈ పార్టీ చీలికవర్గం నేత, కొత్త డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి ..’అంకుల్’ శరద్ పవార్ భలే షాకిచ్చారు. ముంబైలో తన కొత్త ఆఫీస్ ను అజిత్ ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన వర్గం నేతలు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ కార్యాలయం వద్దకు ఉత్సాహంగా చేరుకోగా డోర్స్ కి తాళం వేసి ఉన్న దృశ్యం కనిపించి అవాక్కయ్యారు. తాళం చెవులు ఎక్కడున్నాయో తెలియక అంతా అయోమయంలో పడ్డారు.
ఎవరిని అడగాలో తోచక, ఎలా లోపలికి వెళ్ళాలో తెలియక వారంతా తలలు పట్టుకున్నారు. ‘కీస్’ మిస్సయ్యాయి. అసలైన ఎన్సీపీ మాదే అని చెప్పుకుంటున్న వీరు చివరకు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించినా అక్కడా బయటి దృశ్యమే రిపీటయింది. లోపలి గదులు కూడా లాక్ చేసి ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు ఆ గదుల తాళాలనూ బద్దలు కొట్టాల్సి వచ్చింది.
ప్రజా పనుల శాఖ తమకు సకాలంలో తాళం చేతులు ఇవ్వడంలో విఫలమైందని నేతలంతా ఆరోపించారు. లోగడ శివసేన (ఉద్ధవ్) నేత అంబాదాస్ కు చెందిన భవనాన్ని అజిత్ పవార్ తన కొత్త ఆఫీస్ బిల్డింగ్ గా ఎంచుకున్నారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు మా వైపే
మెజారిటీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని అజిత్ పవార్ తెలిపారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కేబినెట్ సమావేశానికి హాజరై వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ మీటింగ్ విషయంలో కొత్త ఏమీ లేదని, తాము, సీఎం షిండే కూడా గతంలో కేబినెట్ లో కలిసి పని చేసిన వారమేనని అన్నారు. ఆ కేబినెట్ లోనూ చాలామంది మంత్రులుగా పని చేశారన్నారు. బీజేపీకి చెందిన మంత్రులూ.. మేమూ అంతా ఒకప్పుడు కావలసిన వాళ్ళమే అని వ్యాఖ్యానించారు. నాడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి బయటకు వచ్చిన రాధాకృష్ణ విఖే పాటిల్ వంటివారంతా నాకు కొత్త ఏమీ కాదు అని అజిత్ పవార్ చెప్పారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment