యూత్ ఓట్లే టార్గెట్ గా హస్తం స్కెచ్!
యువతను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు
మరో కీలక యాత్ర ప్రారంభం
జూలై 5 నుంచి యువ పోరాట యాత్ర
యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యం
నిరుద్యోగులు, విద్యార్థులకు జరిగిన అన్యాయం పై ప్రచారం
ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ పై కాంపెయినింగ్
ఇప్పటికే నిరుద్యోగ గర్జన పేరుతో సభలు
తెలంగాణలో ఇప్పుడు యూత్ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో యువతను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఎందుకంటే నిరుద్యోగ సమస్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నిరుద్యోగ గర్జన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలకు మంచి స్పందన వస్తోంది.
ఈసభలకు యువత భారీగా వస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యువతను మరింత తమ తిప్పుకోవాలని పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్లాన్ వేస్తోంది. అందులో భాగంగానే టీ కాంగ్రెస్ ఓ కీలక కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. యువ ఓటర్లను ఆకర్షించడమే టార్గెట్ గా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది.
ఈ యాత్ర జూలై 5 నుంచి ప్రారంభం కానుంది. దీనికి యువ పోరాట యాత్ర అని నామకరణం చేసినట్టుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పేర్కొన్నారు. ఇక సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గం గజ్వేల్ నుంచి యాత్ర ప్రారంభం అవుతున్నట్టుగా ఆయన తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు, యువత సమస్యలు తెలుసుకొని కేసీఆర్ ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు.
దీనికి సంబంధించిన పోస్టర్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. యువపోరాట యాత్రలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని యూత్ డిక్లరేషన్ ను ప్రకటించారు.
ఈ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువత కోసం ఎలాంటి పథకాలు చేపట్టనున్నారనే వివరాలను పొందుపరిచారు.ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించడం వంటి పలు కీలక హామీలను ఆమె ప్రకటించారు. ఈ హామీలను కాంగ్రెస్ ప్రచారం ద్వారా యువతకు చేరవేయనుంది.
అయితే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైసవం చేసుకోవడమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా ప్లాన్ చేస్తున్నారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment