ఉమ్మడి పౌర స్మృతి.. యూసీసీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనూ, దీన్ని తాజాగా పరిశీలించాలని లా కమిషన్ నిర్ణయించడం తోను బీజేపీ ఎంపీ, లా పై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కూడా అయిన బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ.. దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో .. ముఖ్యంగా గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో దీని అమలు సాధ్యమేనా అని ఆయన అనుమానపడినట్టు తెలుస్తోంది. వారి ఆచార, సంప్రదాయాలు, విశ్వాసాలు ఇతర మతాల కన్నా విభిన్నంగా ఉంటాయని, వారికి రాజ్యాంగం కూడా రక్షణ కల్పిస్తోందని ఆయన పేర్కొన్నట్టు సమాచారం.
పర్సనల్, పబ్లిక్ గ్రివాన్సెస్, లా అండ్ జస్టిస్ పై గల స్టాండింగ్ కమిటీ సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. కీలకమైన యూసీసీపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని లా కమిషన్ తన జూన్ 14 నాటి నోటీసులో కోరిన విషయం గమనార్హం. ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ పై కొన్ని పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. డీఎంకే, ఎంఐఎం వంటి విపక్షాలు తమ సూచనలను తెలియజేశాయి. ఇది దేశ విభిన్నత్వానికి హానికరమని డీఎంకే నేత పి. విల్సన్ అన్నారు. పెళ్లి, విడాకులు, వారసత్వం, ఆస్తి హక్కులు వంటివి రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేరుతాయని, దీన్ని సవరించే అధికారాలు రాష్ట్రాలకు ఉండవని ఆయన పేర్కొన్నారు.
ఇండియాలో 398 భాషలు ఉన్నాయని, వీటిలో ప్రజలు 387 భాషలను మాట్లాడుతారని, 11 భాషలు కాలగర్భంలో కలిశాయని వివరించారు. హిందూయిజం లో కూడా ఎన్నో ఉప సంస్కృతులు ఉన్న విషయాన్ని మరువరాదన్నారు. వ్యక్తిగత చట్టాలను బలవంతంగా అన్ని మతాలకు, ఉప సంస్కృతులకు వర్తింపజేసిన పక్షంలో వాటి డైవర్సిటీ దెబ్బ తింటుందన్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీ వివేక్ తన్ఖా .. ఇది దేశంలోని 138 కోట్లమంది ప్రజలకు సంబంధించిన అంశమని, దీన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన 2018 లో లా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన కన్సల్టేషన్ పేపర్ ను గుర్తు చేశారు. రాజ్యాంగం 371 అధికరణం లోని (ఏ) నుంచి (ఐ) వరకు గల నిబంధనలను ఆ పేపర్ లో కమిషన్ ప్రస్తావించిందన్నారు.
ఈశాన్య రాష్ట్రాలతో సహా 11 రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక రూల్స్ ని కమిషన్ గుర్తు చేసిందన్నారు. రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్ ని సైతం ఈ పేపర్ లో తన అభిప్రాయాన్నివ్యక్తం చేసిందని ఆయన వివరించారు. నిన్న జరిగిన సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. యూసీసీకి సంబంధించి తమకు ఇప్పటివరకు 19 లక్షల సూచనలు అందాయని లా కమిషన్ సభ్యులు తెలిపారు. ఉమ్మడి పౌర స్మృతి ప్రతిపాదన మంచిదే గానీ.. దీన్ని అమలు చేసే ముందు ముస్లిములు, గిరిజనుల వంటి అన్నివర్గాలు, మతాల గురువులతో సంప్రదించాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరింది. దీని అమలుపై తొందరబాటు తగదని సూచించింది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హడావుడిగా దీని అమలు తగదని పేర్కొంది. ఈ నెల మూడో వారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ కూడా దేశ వ్యాప్తంగా యూసీసీని అమలు చేయవలసి ఉంటుందన్నారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment