అత్యాధునిక, అత్యంత ఖరీదైన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ను నిమ్స్ లో ప్రారంభించారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం నిమ్స్ కు వెళ్లిన మంత్రి హరీష్.. నిమ్స్ లో ఏర్పాటు చేసిన రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు. ఆ యంత్రం ద్వారా చేయనున్న సర్జరీలకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు. ఎలాంటి ఆపరేషన్లు.. ఎలా నిర్వహిస్తారో మంత్రి హరీష్ కి వైద్యులు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నిమ్స్ ఆస్పత్రిలో కొత్త ఎక్విప్ మెంట్ కోసం సీఎం కేసీఆర్ రూ.153 కోట్లు కేటాయిస్తే.. పలు యంత్రాలు కొనుగోలు చేశామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నిమ్స్ లో డావిన్సీ ఎక్స్ఐ యంత్రాన్ని సమకూర్చుకున్నందుకు.. హరీష్ రావు రావు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ రంగంలో నాలుగో జనరేషన్ రోబోటిక్ యంత్రం కలిగి ఉన్న మొట్టమొదటి ఆసుపత్రి నిమ్స్ అని మంత్రి చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించాలని అనేక అత్యాధునిక యంత్రాలను నిమ్స్ కు ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటికే పలు యంత్రాలు కొనుగోలు చేశాము.. త్వరలోనే మిగిలిన ఎక్విప్ మెంట్ కూడా వస్తుందని వెల్లడించారు మంత్రి.
నిమ్స్ కు విడుదల కావల్సిన ఆరోగ్యశ్రీ నిధులు కూడా వెంటన విడుదల చేయాలని సీఈవోను ఆదేశించారు. ఒకప్పుడు నిమ్స్ పై చిన్న చూపు ఉండేది.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దీనిపై ప్రత్యేక శ్రద్ద పెట్టిందని తెలిపారు. కొత్త బిల్డింగ్ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రేపటితో టెండర్లు కూడా పూర్తవుతాయన్నారు. మరో వారం, 10 రోజుల్లో కొత్త నిమ్స్ బ్లాక్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి హరీష్ చెప్పారు. అది కూడా పూర్తయితే నిమ్స్ లో 4వేల పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు నిమ్స్ కంటే.. ఇప్పుడు ఎంతగా అభివృద్ధి జరిగిందో అందరూ గమనిస్తున్నారని చెప్పారు. కాని కొంతమంది హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారంటూ విపక్ష నేతలను విమర్శించారు. కొంతమందికి మంచి కనబడదు, వినబడదు, మాట్లాడరు అని ఎద్దేవా చేశారు. ఉన్నత పదవిలో ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూంటారు.. వాళ్లు ఆ దేవుడే చూసుకుంటాడని అన్నారు హరీష్ రావు.
ఆలిండియా ర్యాంకర్లు కూడా నిమ్స్ లో చదవాలనే ఆసక్తితో ఉన్నారన్నారు. రోబోటిక్ యంత్రం వల్ల పేదలకు మంచి వైద్యం అందడమే కాకుండా.. డాక్టర్లకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు హరీష్ రావు. తక్కువ సమయంలో, రక్తస్రావం లేకుండా సర్జరీలు నిర్వహించవచ్చు.. దీంతో వైద్యులో రోజులో మరో రెండు ఆపరేషన్లు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. నిమ్స్ లో వైద్య సిబ్బందితో పాటు ఫ్యాకల్టీని కూడా భారీగా పెంచుతున్నామని తెలిపారు. ఎలాంటి ఖాళీలు లేకుండా నిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి హరీష్ వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఆరోగ్య తెలంగాణ సాధించడంలో వైద్యులు, ఇతర సిబ్బంది కృషి ఎంతో ఉందని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ రంగంలో 50 వేల పడకలకు చేరుకుంటున్నామని తెలిపారు. ఇక మెడికల్ కాలేజీలు కూడా భారీగా పెరగడంతో మెడికల్ సీట్లు కూడా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయని హరీష్ రావు చెప్పారు. హెల్త్ సెక్టా ర్‌లో మనం దేశంలో నెంబర్ 3లో ఉందని, త్వరలోనే నెంబర్ 1గా మారాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు మంత్రి హరీష్ రావు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment