వెలుగు బిజినెస్ డెస్క్:
గ్లోబల్ మార్కెట్లో 11 ఏళ్ల గరిష్టానికి చేరిన బియ్యం రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. వరి పండించే ఆరు ప్రధాన దేశాలలోనూ ప్రొడక్షన్ ఈసారి రికార్డు లెవెల్‌కి చేరుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, గ్లోబల్మార్కెట్లో రేట్లు తగ్గే అవకాశాలు లేవని అంటున్నారు. గ్లోబల్మార్కెట్లో ఇండియాకు 40 శాతం వాటా ఉంది. అంతేకాదు, మన దేశం నుంచి ఎగుమతయ్యే బియ్యం రేటే తక్కువ కూడా. కానీ, ఈసారి మాత్రం ఎగుమతుల మార్కెట్లో మన బియ్యం రేట్లు అయిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కొత్త సీజన్ కోసం వరి రైతులకు చెల్లించే మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం కిందటి నెలలో 7 శాతం పెంచింది. గ్లోబల్ మార్కెట్లో మన బియ్యం రేట్ల పెరుగుదలకు ఇది కూడా కారణమని చెబుతున్నారు.
300 కోట్ల మందికి బియ్యమే కావాలి..
గ్లోబల్‌గా చూస్తే 300 కోట్ల మందికి ప్రధానమైన ఆహారం బియ్యమే. ఆసియా దేశాలలో వరి సాగుకు నీరు చాలా ఎక్కువగా అవసరం. ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ ఉండొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ బియ్యం ప్రొడక్షన్‌పై పడే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు ఫుడ్ అండ్ ఎగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) రైస్ ప్రైస్ ఇండెక్స్ ఇప్పటికే 11 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఈ ఏడాది వరిసాగు చేసే ఆరు ప్రధాన దేశాలు బంగ్లాదేశ్, చైనా, ఇండియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాంలలో రికార్డు లెవెల్ ప్రొడక్షన్ వస్తుందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్రికల్చర్ (యూఎస్డీఏ) ఎస్టిమేషన్స్ రిలీజ్ చేసింది.
చక్కెర, మాంసం, గుడ్ల రేట్ల పెరుగుదల..
ఇటీవలి నెలల్లో చక్కెర, మాంసం, గుడ్ల రేట్లు గ్లోబల్మార్కెట్లో భారీగా పెరిగాయి. చాలా మంది ప్రొడ్యూసర్లు ఎగుమతులను తగ్గించుకోవడమే దీనికి కారణం. ఆసియా దేశాలలో వరి దిగుబడి బంపర్‌గా ఉంటుందని కొంత మంది నిపుణులు అంచనా వేస్తున్నా, ఎల్‌నినో కారణంగా దిగుబడి తగ్గుతుందని గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీలు చెబుతున్నారు. సప్లయ్ తగ్గడంతో బియ్యం రేట్లు పెరగడం మొదలైందని ఓలమ్ ఇండియా ప్రతినిధి గుప్తా పేర్కొన్నారు. ఈ టైములో ప్రొడక్షన్ తగ్గితే, రేట్లు మరింత పెరుగుతాయని చెప్పారు. 2023–24 చివరకు గ్లోబల్‌గా బియ్యం నిల్వలు ఆరేళ్ల కనిష్టానికి (170.20) మిలియన్ టన్నులకు పడిపోతాయని భావిస్తున్నారు. డిమాండ్ జోరందుకోవడంతో ప్రధాన ప్రొడ్యూసర్లయిన చైనా, ఇండియాలలో నిల్వలు తగ్గిపోతున్నాయని యూఎస్డీఏ చెబుతోంది. ఈ నేపథ్యంలో వరి దిగుబడి ఏ మాత్రం తగ్గినా, బియ్యం రేట్లు అయిదో వంతు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఆసియాలోని చాలా దేశాలలో రెండో పంటపై ఎల్ నినో ఎఫెక్ట్ ఉండొచ్చని న్యూఢిల్లీ గ్రెయిన్స్ డీలర్ ఒకరు పేర్కొన్నారు. మే నెలలో వర్షపాతం సాధారణం కంటే 26 శాతం తక్కువగా రికార్డవడంతో థాయ్‌లాండ్ తన దేశంలోని వరి రైతులకు ఒక పంట మాత్రమే వేయమని సలహా ఇచ్చింది.
మన బియ్యమే చీప్..
ప్రపంచంలోని అన్ని దేశాల కంటే తక్కువ రేటుకే మన బియ్యం ఎగుమతి అవుతున్నాయని రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీ వీ కృష్ణారావు రాయిటర్స్‌కు చెప్పారు. కనీస మద్దతు ధర పెంపుతో మన బియ్యం రేట్లు పెరిగాయని, దీంతో ఇతర దేశాలలోని సప్లయర్లు సైతం రేట్లను పెంచుతున్నారని పేర్కొన్నారు. ఎల్‌నినో ఎఫెక్ట్ ఏదో ఒక దేశానికి పరిమితమైనది కాదని, వరిసాగు చేసే అన్ని దేశాలపైనా ఉంటుందని ఓలమ్ ఇండియా రైస్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ గుప్తా వెల్లడించారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment