కాళేశ్వరం కథలు. కాగ్ రిపోర్ట్ తో కలవరం మొదలు!
అంచనాల పెంపుతో 60 వేల కోట్ల భారం
డీపీఆర్ చుట్టూ సీబీఐ అరెస్టుల పర్వం
ఏటా ఎకరం నిర్వహణ వ్యయం 46 వేలు
ఇంజనీర్లతో దోస్తీ కట్టి దోచుకున్న మెగా కంపెనీ
కాళేశ్వరం కథలు పేరుతో గతంలో తొలివెలుగు కథనాలు
కాగ్ నివేదికతో కంగారులో ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు
వాటాల పేరుతో మోసాలకు పాల్పడ్డ బడా కంపెనీ?
కాళేశ్వరం అంచనాలు ఎలా పెరిగాయి? ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఎవరి వలన భారం అయింది? ఇంజనీర్ల పేర్లతో సహా బడా కంపెనీల వ్యవహారాన్ని తొలివెలుగు క్రైంబ్యూరో బట్టబయలు చేసింది. మోటార్ల కొనుగోళ్ల గోల్ మాల్ నుంచి బాహుబలి పంపులు మునిగేంత వరకు ఏం జరిగిందో ప్రజల ముందు ఉంచింది. అయితే.. ఇప్పుడు కాగ్ నివేదికతో మరోసారి ఏది నిజమో ప్రజలకు తెలిసిపోతోంది.
1. కేంద్ర జలసంఘం డీపీఆర్ లో ఆమోదించిన ఖర్చుకి అంచానాలకు తేడా అక్షరాలా రూ.67 వేల 406 కోట్లు.
2. ఎకరాకు ఏడాదికి 46 వేల 364 రూపాయలు. ఏడాదికి విద్యుత్ ఖర్చే 10 వేల కోట్లు. ఇది రాష్ట్ర విద్యుత్ వినియోగంలో 47 శాతం.
3. ఒక్క టీఏంసీ 17,668 ఎకరాలకు సాగునీరంటూ డీపీఆర్ లో పొందుపర్చారు. కానీ, అన్ని ప్రాజెక్ట్స్ లో ఒక్క టీఏంసీ 10 వేల ఎకరాల సాగుకు మించదు. 169 టీఏంసీలు సాగునీటి కోసమంటూ తెలిపారు. ఈ నీరంతా వారు చూపించిన ఆయకట్టకు వాడుకుంటే ఖరీఫ్ కే సరిపడవు. కానీ, పరిశ్రమలకు, చేపల పెంపకానికి నీరు అందిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని లెక్కలు వేశారు.
4. విద్యుత్ ఛార్జీలు 3 రూపాయలుగా లెక్కలు కట్టారు. కానీ, ఎత్తిపోతల పథకాలకు యూనిట్ రూపాయలు 6.40 ఉంది. ఇందుకు 8,460 మెగావాట్ల విద్యుత్ అవసరం. మూడో టీఎంసీ కూడా వాడుకుంటే 14,345 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం ఉంటుంది. అంటే, ఒక్కొక్క యూనిట్ కి 6 రూపాయలతో లెక్కలు వేస్తే తడిసి మోపెడు అవుతుంది.
5. లాభం – ఖర్చు నిష్పత్తిలో ప్రాజెక్ట్ ఖర్చులో రూపాయి పెడితే రూపాయి యాభై పైసలు వస్తాయని అంచనా వేశారు. కానీ, రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలు మాత్రమే ప్రయోజనం. ఇది ఇప్పటి అంచనాల పెంపు ఖర్చుతో చూస్తే రూపాయి ఖర్చు చేస్తే 50 పైసలు కూడా రావడం లేదు. అంటే, ఎకరాకు కాళేశ్వరం నీళ్లు రావడానికి నిర్మాణ వ్యయం రూ.6 లక్షల 50 వేలు. నిర్వహణ, విద్యుత్ ఛార్జీలు కలిపితే ఏటా ఎకరానికి 46 వేల 400 ఖర్చు వస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 87 వేల 950 కోట్లు రుణాలు తీసుకొచ్చారు. ఇందుకు వడ్డీ 7.8 శాతం నుంచి 11 శాతం వరకు ఉంది. దీంతో అప్పులకు వడ్డీలు చెల్లించడం వేరే లెక్కలు ఉన్నాయి.
6. మూడో టీఏంసీకి 30 వేల కోట్లు. అదనపు టీఎంసీ కోసం రెండు టీఎంసీలు పూర్తి అయ్యేంత వరకు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుందని ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు అది 28 వేల 150 కోట్లకు చేరుకుంది.
7. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో భూకంప ప్రభావం ఉంటుందని అధ్యయనం చేయకుండానే 50 టీఏంసీల రిజర్వాయర్ నిర్మించారని కాగ్ తప్పు పట్టింది.
8. మిడ్ మానేరు నుంచే 65 శాతం నీటిని శ్రీరామ సాగర్ ఆయకట్టలో సాగు చేయవచ్చు. కానీ, వరద కాలువ నుంచి శ్రీరామ సాగర్ కి ఎత్తి పోయడం అదే నీటిని కాకతీయ కాలువలకు వదలడం ద్వారా 2 వేల కోట్లు ఖర్చు చేశారు
ఖర్చు పెరిగింది ఇక్కడే!
సివిల్ వర్క్స్, టన్నెల్స్ కి ప్రధానంగా మెగా కంపెనీ చేసిన పనుల్లో.. రూ.63,352 కోట్ల నుంచి రూ.1,06,187 కోట్లకు పెంచారు. సబ్ స్టేషన్స్ నిర్మాణంలో రూ.2,885 కోట్ల నుంచి రూ.6,594 కోట్లకు ఖర్చు చేశారు. నిర్మాణ సమయంలో వడ్డీ రూ.19,556 కోట్లు అయింది.
అంచనాలు యథావిధిగా ఉంది ఈ పనుల్లోనే!
ఆపరేషన్ అండ్ మెయిటెనెన్స్ రూ.1,500 కోట్లు. ల్యాండ్ డెవలప్మెంట్ రూ.1477 కోట్లు. పునారావాసానికి రూ.1500 కోట్లు. అటవీ భూమికి రూ.740 కోట్లు, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జీలు రూ.1365 కోట్లు, టూల్స్ అండ్ ప్లాంట్స్ కి రూ.769 కోట్లు, పరోక్ష ఛార్జీలు రూ.1,128 కోట్లు. ఇవన్నీ ఏమీ పెరగలేదు.
1. ఇంట్రో.. కథనం.
మోటార్లు నీటిలో మునగడంతో అవినీతి మేఘాలు.. ప్రజాధనం బురదపాలు అంటూ లక్ష కోట్లు నీళ్లపాలు ఎలా అయిందో.. మొదటి ఇంట్రో కథనం ఇచ్చాం.
2. చంద్రగ్రహణం-కృష్ణార్పణం
కాలకేయుడి భాష మాదిరి అర్థం కాని కృష్ణమాయ, తెరచాటున చంద్రలీల? అంటూ ముక్తేశ్వర స్వామి సాక్షిగా కళ్లకు కట్టే నిజాలంటూ పరిశోధనాత్మక కథనాలు పార్ట్-1 గా ప్రచురించాం. తమ్మిడిహట్టిని కాదని రీ డిజైన్ పేరుతో 7 లింకులు, 28 ప్యాకేజీలుగా మార్చి కాంట్రాక్టర్ కరప్షన్, అడ్డగోలు నిర్ణయాలు చూపించాం. ప్యాకేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు గోదావరికి 100 మీటర్ల ఎత్తులో నిర్మించారంటూ ఎలా ప్యాకేజీలు ఇచ్చారో.. టెండర్లు దక్కించుకున్న హిందుస్తాన్ కన్ స్ట్రక్షన్, ఎస్ఈడబ్యూ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్, నవయుగ ఇంజనీరింగ్ అంటూ ఎలా ఇచ్చారు.. అంచనాలు సుందిళ్ల బ్యారేజ్ కి రూ.1000 కోట్లు, మేడిగడ్డకు రూ.700 కోట్లు, అన్నారం కి రూ.800 కోట్లు, ఏడాదిలోనే ఎలా పెంచేశారని ఆధారాలతో సహా ప్రచురించాం. నాగార్జున సాగర్, శ్రీరామ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పుడు ఎంత అంచనాలు ఉన్నాయి.. పూర్తి అయ్యాక ఎంత శాతం పెరిగిందో.. లెక్కలు కట్టి పూసగుచ్చినట్లు ప్రచురించింది తొలివెలుగు.
3. నమ్మించి ముంచారా?
అవినీతి ఎత్తిపోతలు? అంటూ సారును నిండా ముంచిన కృష్ణారెడ్డి అంటూ టెండర్లు డైమండ్ హౌజ్ లో ఎలా జరిగాయో కాళేశ్వరం కరప్షన్ కహానీ పార్ట్-2 అని రాశాం. 50 లక్షల క్యూసెక్కుల వరద కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చినా పట్టించుకోకుండా.. కరువు ఏడాదులైనా 1994-2004 తోనే లెక్కలు వేసి పంపు హౌజ్ లు నిర్మించారు. లక్ష్మీ పంప్ హౌజ్ లో నిర్మాణ లోపం వలనే మునిగాయని అక్కడికి వెళ్లి పరిశీలించి వార్తలు ఇచ్చాం. వరద నీటి మట్టం 121 మీటర్లు అయితే.. మెగా కంపెనీ 106 మీటర్ల వరకే నిర్మించింది. గతేడాది వచ్చిన వరద 113 మీటర్లు అంటూ సాక్ష్యాలు చూపించాం.
4. మేఘాకు కోట్లు – రైతులకు పాట్లు
మోటార్ల కొనుగోళ్లలో వేల కోట్ల గోల్ మాల్ ఎలా జరిగిందో పార్ట్-3 లో అందరికీ అర్థమయ్యేలా ప్రచురించాం. ఎక్కడా దొరకకుండా ఏరికోరి అసెంబుల్డ్ ఫిట్టింగ్స్ అంటూ ఘరానా స్కాం ఆధారాలను మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి వద్ద నుంచి సేకరించాం. ఆర్టీఐ ద్వారా బీహెచ్ఈఎల్ లో రూ.15,000 కోట్ల మోటార్ల స్కాం బయటపడింది. మేఘాతో ఒప్పందాలు బయటకు రాకుండా కహానీలు చెప్పి.. ఆర్టీఐలు తిరస్కరించారు. కోర్టులను తప్పుదారి పట్టించి.. కేసులను వీగేలా చేయించుకున్నారు కృష్ణారెడ్డి. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి నాగం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. చెప్పింది ప్రతీది తొలివెలుగు వద్ద ఆధారాలు ఉన్నాయి.
5. మెగా చౌర్యం
అంచనా మెగా.. వేల కోట్ల దగా? అంటూ ప్యాకేజీల వారీగి అవినీతిమయం అంటూ సివిల్ వర్క్స్ లో 40 శాతం కమిషన్ తో సబ్ కాంట్రాక్ట్స్ కు ఇవ్వడం.. నాణ్యత లేకపోవడం, ఫోటోలకు, వీడియోలకు కోట్లు ఖర్చు చేయడంపై తొలివెలుగు క్రైంబ్యూరో ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాయి. ఇంజనీర్స్ తో డైరెక్ట్ లింకులు పెట్టుకుని మంత్రి హరీష్ రావుని సైతం ఎలా సైడ్ చేశారో రాశాం. ప్యాకేజీ 6, 8, 10, 11లో అంచనాలు ఎలా పెరిగాయో సవివరంగా వివరించాం.
6. మేఘాల చాటున చంద్రుడు అంటూ స్విస్ రహస్యాలు ప్రచురించాం. సీఎం కళ్లు కప్పి బ్యాక్ డెటెడ్ జీవోతో విదేశాలకు వెళ్లారు. స్విట్జర్ ల్యాండ్ లో మేఘా పార్టీ అంటూ పార్ట్-5 గా ప్రత్యేక కథనం రాశాం.
7. జీతాలు లక్షల్లో – ఆస్తులు కోట్లల్లో!
కాళేశ్వరం ప్రాజెక్ట్స్ లో ఈఎన్సీల పాత్ర చాలా మోసపూరితంగా ఉంది. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గా ఉంటూ మెగా సంస్థ నుంచి డబ్బులు తీసుకుని కాంట్రాక్టర్స్ కి మేలు చేశారు. అందుకు రిటైర్డ్ అయినా పోస్టులో ఉండటంతో వందలాది కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకున్నారు. హరిరాం కు ఎలా సిద్దిపేటలో భూములు ఉన్నాయి. వెంకటేశ్వర్లు పేరుకే ఉద్యోగి అయినా మేఘాకు లబ్ది చేశారని, మురళీధర్ రావు తన కుమారుడైన అభిషేక్ కు, తన చిన్ననాటి ఫ్రెండ్ కుమారుడు హర్షవర్ధన్ రెడ్డికి ఎలా కాంట్రాక్టులు తెప్పించుకున్నారో ఇంజనీర్ల పనితీరు, వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ కథనాలు ఇచ్చాం.
దర్యాప్తు జరిగేనా?
బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి ఏటీఎం అంటూ చెబుతూ వస్తోంది. రూ.40,000 కోట్లు కాంట్రాక్టర్స్ కి అదనంగా దొచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అంచనాల పేరుతో అందరూ భారీగా లబ్ది పొందడంపై దర్యాప్తు జరిగితే అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయం సర్వత్రా ఉంది. డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ కంపెనీ అధినేత రాజేంద్ర గుప్తా 40 కోట్ల నగదుతో సీబీఐకి దొరికారు. ఆయన కుమారుడు గౌరవ్ ని సైతం అరెస్ట్ చేశారు అధికారులు. కాళేశ్వరం గురించి చెప్పాలంటే ఆర్థిక కన్నీళ్లే మిగులుతాయని.. వాగులపై చెక్ డ్యామ్స్, మరోసారి మిషన్ కాకతీయ, కబ్జాలకు గురికాకుండా చెరువులను, వాగులను, కాపాడితే సుమారు లక్ష కోట్లు తెలంగాణ సేవ్ చేసేదని నీటిరంగ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్నా.. అధిక ఖర్చుతో తెలంగాణ ప్రజలకు మోయలేని భారంగా ఇది మారిందని చెబుతున్నారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment