నితీష్ లో ‘మహారాష్ట్ర వణుకు’.. ఎమ్మెల్యేలతో భేటీలు షురూ !
మహారాష్ట్రలో రేగిన ఎన్సీపీ ‘సునామీ’ ఘోష బీహార్ లోనూ ‘ప్రతిధ్వనించవచ్చునని’ నితీష్ బెంబేలు చెందుతున్నారు. మహారాష్ట్రలోని తాజా రాజకీయ పరిణామాలు, ‘నిశ్శబ్ద కుట్ర కోణాలు’ తమ రాష్టంలోనూ ఎక్కడ మొదలవుతాయేమోనని ముఖ్యమంత్రి, జేడీ-యు అధ్యక్షుడు నితీష్ కుమార్ కలత చెందుతున్నారని తెలుస్తోంది. ఎన్సీపీలో చీలిక తేవడంలో సఫలీకృతమైన బీజేపీ నుంచి ఇక్కడ తమక్కూడా గండం పొంచి ఉందన్న భయంతో ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
గత ఏడాది బీజేపీతో కటీఫ్ చేసుకున్న ఆయన అప్పుడే పాట్నాలో తమ ఎమ్మెల్యేలతో భేటీకి శ్రీకారం చుడుతున్నారు. రేపో, మాపో కీలకమైన ఈ సమావేశం జరిగే సూచనలున్నాయి. ఎమ్మెల్యేలతోనే కాకుండా తమ పార్టీ ఎంపీలతోనూ ఆయన ముఖాముఖీ మీటింగ్ నిర్వహించవచ్చునని జేడీ-యు వర్గాలు తెలిపాయి. ఇక నితీష్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితోఉన్నారని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోడీ ఇటీవల వ్యాఖ్యానించారు.
బీజేపీని నితీష్ వెన్నుపోటు పొడిచిన తీరును వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. తమ భవిష్యత్తు గురించి వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నితీష్ కుమార్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో ‘అత్యవసర’ సమావేశం నిర్వహిస్తున్నారంటే అది పాలక సంకీర్ణ కూటమిలోని అసంతృప్తిని తెలియజేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.
పరిణామాలు ఎలా మారినా మారవచ్చునన్నారు. అయితే బీజేపీ చేస్తున్న ఈ ప్రాపగాండాను జేడీ-యు జాతీయ అధికార ప్రతినిధి రజీబ్ రంజన్ కొట్టిపారేశారు. గణేశుడు పాలు తాగుతున్నాడని కొన్నేళ్ల క్రితం వారు చేసిన ప్రచారం లాగే ఇది కూడా ఉందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధమైన ప్రచారాలను నమ్మబోరని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment