మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మోస్ట్ పవర్‌ఫుల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహిస్తానని ఊహించలేదని అన్నారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అడుగుపెట్టిన తాను కంపెనీ సీఈవో అవుతానన్న ఆలోచన కూడా లేదంటూ లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్‌స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ‘1992లో 22 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరాక, ఈ ప్రపంచంలోనే గొప్ప ఉద్యోగం చేస్తున్నానని అనుకునేవాణ్ని. నేను చేస్తున్న పని గొప్పదనే భావనతో ఉండేవాణ్ని. మరో చోటికి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు ఉండేది కాదు’ అని అన్నారు.
చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల లేదని, వేరే ఆఫీస్‌లో చేరదాం అనే ఆలోచనతో కాకుండా.. ప్రస్తుతం ఆఫీస్‌లో మీరు చేస్తున్న పాత్రని విజయవంతంగా పోషించండి. మైక్రోసాఫ్ట్‌లో నేను నేర్చుకున్న పాఠం ఇదే. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు. మొత్తం 30 ఏళ్ల మైక్రోసాఫ్ట్ కెరియర్‌లో నేను చేస్తున్న ఉద్యోగం గురించి ఎప్పుడూ ఆలోచించిన సందర్భం లేదు. నేను అక్కడ చేస్తున్న ఉద్యోగం చాలా ముఖ్యమైన విషయంగా భావించినట్లు వివరించారు.
మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మీ కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డంకిగా భావించడానికి బదులుగా ఆసక్తిని, అంకితభావాన్ని, నేర్చుకోవడాన్ని ఓ అవకాశంగా భావించాలి. ఈ మనస్తత్వాన్ని అవలంబించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాల్ని అంటే ప్రమోషన్‌లు లేదా శాలరీల పెంపును వేగంగా పొందగలుగుతారని అన్నారు. చేస్తున్న పని వల్ల ఎదుగుదల ఉండడం లేదని అనిపిస్తే మీరు ఎప్పటికీ ఎదగలేరని సూచించారు.
ఇప్పటికీ చాలా మంది కెరీర్‌కు సంబంధించి మంచి సలహా ఇవ్వమని అడుగుతుంటారు. వారికి నేను చెప్పేదొక్కటే.. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దని చెబుతాను. నేను సీఈవో అయ్యే ముందు రోజు వరకు నాకు అలాంటి ఆలోచనేలేదు అని లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్‌స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల తన మనసులో మాటని బయటపెట్టారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment