ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. నెలకు ఒక్కొక్కరికి రూ.10వేలు
Ap Temples Priests Salary Hike
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో దేవాలయాల్లో అరకొర జీతాలతో స్వామివారి సేవలు చేస్తున్న అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచాలని నిర్ణయించింది. అలాగే రిటైర్మెంట్ వయసు పెంపుపైనా నిర్ణయం తీసుకున్నారు. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మరోవైపు త్వరలోనే దేవాలయాల్లో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యానారాయణ.
ఏపీలో అర్చకులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 10వేల లోపు ఆదాయం ఉన్న అర్చకులకు రూ. 10 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతాయన్నారు. అంతేకాదు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును కూడా 62కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న 2,625 మంది అర్చకులకు పెంచిన వేతనాలను వచ్చే నెల నుంచే అందిస్తామన్నారు మంత్రి. త్వరలో దేవాలయాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఆలయ భూముల ఆక్రమణదారులకు 8 ఏళ్లకు మించి శిక్ష పడేలా చట్టాన్ని మార్చామన్నారు.
రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆలయాల్లో సాంకేతిక సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. దేవాలయాల పరిరక్షణ కోసం సెక్షన్ 83లో మార్పులు తెస్తున్నామని.. వివాదాస్పదమైన గ్రూప్ – 3 ఈవోల ప్రమోషన్ల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. పొన్నూరు భావన్నారాయణ స్వామి దేవాలయ భూములను ఆటో నగర్‌కు కేటాయించాలని ప్రతిపాదన వచ్చిందని.. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ఎలా ఇచ్చిందో తెలియదన్నారు మంత్రి. అది టీడీపీ అధినేత చంద్రబాబు రిపోర్ట్ కావొచ్చని ఎద్దేవా చేశారు. పవన్ అజ్ణానంతో మాట్లాడుతున్నారని.. ఉన్మాదంతో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మండిపడ్డారు. కరోనా వంటి విపత్తు సమయంలోసవాలంటీర్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని.. పవన్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ను జనం అసహ్యించుకుంటున్నారన్నారు. వాలంటీర్ల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించామని.. వాలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్రమోదీతో సహా దేశమంతా మెచ్చుకుంటోందన్నారు.
వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. వాలంటీర్లలో జనసేనకు చెందిన వాళ్లు కూడా ఉన్నారని.. వారేమైనా మహిళల అక్రమ రవాణా చేస్తున్నారా అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ గొడవ జరిగినా దానితో జనసేనకు చెందిన కార్యకర్తలకు సంబంధం ఉంటుందన్నారు. వాలంటీర్లు ఉగ్రవాదులు, సంఘ విద్రోహులని ఆయన ఎలా మాట్లాడతారని.. వాలంటీర్లేమీ పాకిస్థానీలు కారన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారేనని.. వారిపై జనసేన అధినేత పవన్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారన్నారు.. ఈ వ్యాఖ్యలతో ఎవరికి బాధ కలిగితే వారు కేసులు పెడతారని.. తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రతి విషయాన్ని సభల ద్వారా, సమీక్షల ద్వరా తెలియజేస్తున్నారని.. ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment