AI: ఉద్యోగుల స్థానంలో ఏఐ.. దుకాణ్ కీలక నిర్ణయం
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న దుకాణ్ (Dukaan) స్టార్టప్ ఈ-కామర్స్ కంపెనీ సీఈవో చేసిన ట్వీట్ను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. అయితే, తన నిర్ణయాన్ని తప్పుపడుతున్న వారంతా లింక్డ్ఇన్లో తన వివరణ చదవాలని ఆయన కోరారు.
బెంగళూరు: కృత్రిమ మేధ (AI) క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఉద్యోగులకు బదులుగా ఏఐతో సేవలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తాజాగా బెంగళూరు(Bengaluru) కేంద్రంగా పనిచేసే దుకాణ్‌ (Dukaan) అనే ఈ-కామర్స్‌ స్టార్టప్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో కస్టమర్‌ కేర్‌ విభాగంలో పనిచేసే 90 శాతం మంది ఉద్యోగులను ఏఐతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ సీఈవో సుమిత్‌ షా ట్వీట్ చేశారు.
‘‘మా సంస్థలో 90 శాతం మంది కస్టమర్‌ సపోర్ట్ టీమ్‌ను ఏఐతో భర్తీ చేశాం. ఈ నిర్ణయం కష్టమైనదే.. కానీ, తప్పడంలేదు. సంస్థ లాభాల వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల కస్టమర్‌కేర్‌ నిర్వహణ కోసం కంపెనీ ఖర్చు చేసే మొత్తం 85 శాతం తగ్గింది. అలానే, ఒక వినియోగదారుడికి సేవలను అందించే సమయం రెండు గంటల నుంచి మూడు నిమిషాలకు తగ్గింది’’ అని తెలిపారు. దుకాణ్‌ సీఈవో నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. అయితే, ట్విటర్‌లో తన నిర్ణయాన్ని తప్పుబడుతున్న వారంతా లింక్డ్‌ఇన్‌లో ఇచ్చిన వివరణ చూడాలని సుమిత్‌ కోరారు.
‘‘దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని చాలా వరకు స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాలని అనుకోవడంలేదు. లాభదాయకమైన సంస్థలుగా మాత్రమే కొనసాగాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో కస్టమర్‌కేర్‌ విభాగంలో ఏఐను వినియోగించడం వల్ల సమయం ఆదా అవడంతోపాటు, వేగవంతమైన సేవలను అందివ్వొచ్చు. అయితే, ఉద్యోగులను ఏఐ భర్తీ చేయగలదని నేను భావించడంలేదు. సమర్థవంతమైన ఉద్యోగులకు ఒకే తరహా బాధ్యతలను అప్పగించడంకంటే, కంపెనీ అభివృద్ధికి తోడ్పడే ఇతర విభాగాల్లో వారికి విధులను అప్పగించడం సరైన నిర్ణయం’’ అని లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, తమ సంస్థలో కస్టమర్‌కేర్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులని, వారికి రోజూ ఒకే విధమైన బాధ్యతలు అప్పగించడం వల్ల విధి నిర్వహణలో చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారని.. సంస్థ అంతర్గత సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన వారు సంస్థలోని ఏఐ, ఈ-కామర్స్‌, ప్రొడక్ట్‌ డిజైన్ వంటి విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment