Chandrayaan 3: చంద్రయాన్-3 మిషన్.. కీలకమైన భాగాలు సరఫరా చేసింది ఈ కంపెనీయే..
Chandrayaan 3: ముంబై సబర్బన్‌లో ఉన్న గోద్రెజ్ ఏరోస్పేస్ కంపెనీ చంద్రయాన్-3 మిషన్ కోసం వికాస్, CE20 వంటి లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్లను, శాటిలైట్ థ్రస్టర్లను ఉత్పత్తి చేసింది. ఈ వివరాలను కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
చంద్రుడిపై అన్వేషణలో భాగంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం జులై 14న జరగనుంది. ఈ మిషన్ చందమామపై రోవర్‌ను దించేందుకు భారత్ చేస్తున్న మూడవ ప్రయోగం కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటిసారిగా చంద్రునిపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మిషన్‌కు సంబంధించి కొన్ని కీలకమైన వివరాలు బయటికి వచ్చాయి. ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ, చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రోకి ముఖ్యమైన భాగాలను సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
ముంబై సబర్బన్‌లో ఉన్న గోద్రెజ్ ఏరోస్పేస్ కంపెనీ ఈ లూనార్ మిషన్ కోసం వికాస్, CE20 వంటి లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్లను, శాటిలైట్ థ్రస్టర్లను ఉత్పత్తి చేసింది. ఈ వివరాలను కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
గోద్రెజ్ ఏరోస్పేస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ మానెక్ బెహ్రామ్‌కమ్‌డిన్ తాజాగా మాట్లాడుతూ తమ కంపెనీ 30 ఏళ్లకు పైగా స్పేస్ డిపార్ట్‌మెంట్‌లో భాగమైన ఇస్రోతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. ముందు ఇస్రో మిషన్ల కోసం క్లిష్టమైన భాగాలు తయారు చేసేందుకు గోద్రెజ్ ISROతో కలిసి పని చేసిందని.. తర్వాత లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్లతో సహా వివిధ ప్రాజెక్టుల కోసం ఒకదానికొకటి సహకరించుకోవడం మొదలుపెట్టాయని పేర్కొన్నారు.
కొత్త యూనిట్
గోద్రెజ్ ఏరోస్పేస్ చంద్రయాన్-1, చంద్రయాన్-2, మంగళయాన్ వంటి అంతరిక్ష యాత్రల విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇస్రో చేపట్టిన ఇతర ప్రయత్నాలలోనూ చురుకుగా పాల్గొంది. మహారాష్ట్ర తీర ప్రాంతంలోని రాయ్‌ఘడ్ జిల్లా ఖలాపూర్‌లో గోద్రెజ్ ఏరోస్పేస్ కొత్త యూనిట్‌ను నిర్మించేందుకు రూ.250 కోట్లు పెట్టుబడి పెడుతుందని బెహ్రామ్‌కమ్‌డిన్ పేర్కొన్నారు. ఈ కొత్త ఫెసిలిటీ ద్వారా తయారీ, అసెంబ్లీ కోసం అధునాతన సామర్థ్యాలను కంపెనీ అందుబాటులోకి తేనుంది. ఈ ఫెసిలిటీతో టెక్నాలజీని మెరుగుపరుస్తుంది. అంతరిక్ష రంగంలో పెరుగుతున్న డిమాండ్లను తీరుస్తుంది.
చంద్రయాన్ విశేషాలు
చంద్రయాన్-3 శుక్రవారం (జులై 14) మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రయోగించనున్నారు. 2019, సెప్టెంబర్‌లో ప్రయోగించిన చంద్రయాన్-2 ల్యాండర్, సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా క్రాష్-ల్యాండింగ్ అయింది. దాని తర్వాత ప్రయోగిస్తున్న చంద్రయాన్-3 మిషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2008లో ల్యాండర్ లేకుండా ఆర్బిటర్, ఇంపాక్టర్‌తో ప్రయోగించిన చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీటి అణువులు ఉన్నట్లు గుర్తించింది. శాశ్వతంగా నీడ ఉన్న క్రేటర్లలో నీటి మంచు నిక్షేపాల ఉనికిని గుర్తించింది. ఇండియన్ స్పేస్ హిస్టరీలో ఇదొక గొప్ప విజయంగా నిలిచింది.
ఇప్పటిదాకా అమెరికా, రష్యా , చైనా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా అంతరిక్ష నౌకలను ల్యాండ్ చేయగలిగాయి. తర్వాత భారతదేశానికి చెందిన చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలాన్ని తాకగలిగింది, కానీ అది క్రాష్ లాండ్ అయ్యింది. కాగా ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని ఇండియా కృషి చేస్తోంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment