Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్‌హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ (Robert J Oppenheimer).
ఇంటర్నెట్ డెస్క్: హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓపెన్‌హైమర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అణుబాంబు (atomic bomb) సృష్టికర్త, శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ (Robert J Oppenheimer) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే హైమర్ జీవితం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరాయన? అణుబాంబును ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? మళ్లీ ఆయనే దాన్ని ఎందుకు వ్యతిరేకించారు?
తాత ఇచ్చిన రాళ్లతో..
హైమర్ 1904, ఏప్రిల్ 22న అమెరికాలోని న్యూయార్క్‌లో జన్మించాడు. అమ్మానాన్నలది జర్మనీ. చిన్నప్పటి నుంచే చురుకుగా, తెలివిగా ఉండే హైమర్ ఐదేళ్ల వయసులో తాతగారు ఇచ్చిన కొన్ని ప్రత్యేకమైన రాళ్లను పరిశీలిస్తూ, భూగర్భశాస్త్రం(జియాలజీ)పై ఇష్టం పెంచుకున్నాడు. మైక్రోస్కోప్ అంటే ఎంతో ఇష్టం. తన వయసు పిల్లలంతా ఆడుకుంటే.. హైమర్ మాత్రం నీటి బిందువుల్ని పరిశీలిస్తూ సూక్ష్మజీవుల గురించి తెలుసుకునేవాడు. గ్రీకు, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్.. ఇలా అనేక భాషలను నేర్చుకున్న అతడు.. చిన్నప్పుడే గ్రీకు వేదాంత గ్రంథాలు చదివేశాడు. ఆయా భాషల్లో కవిత్వం రాసేవాడు.
11 ఏళ్లకే ఉపన్యాసం..
భూగర్భశాస్త్రం మీద ఆసక్తితో అమెరికాలోని భూగర్భ శాస్త్రవేత్తలకు హైమర్ లేఖలు రాసేవాడు. తన రాతని చూసి వారు తనని బాలుడిగా గుర్తించి లెక్క చేయరేమోనని ఉత్తరాల్ని టైప్ చేసి పంపేవాడు. శాస్త్రవేత్తలు హైమర్ బాలుడని తెలియక న్యూయార్క్ మినరలాజికల్ క్లబ్ సభ్యునిగా చేసి, అక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి ఆహ్వానించారు. అప్పటికి హైమర్ వయసు 11ఏళ్లు. అతడిని చూసిన శాస్త్రవేత్తలు ముందు ఆశ్చర్యపోయారు. స్టేజీపై కుర్చీలో కూర్చుంటే అతడి పాదాలు నేలకు తగల్లేదట. తర్వాత తన ఉపన్యాస ప్రతిభకు వారు ఆశ్చర్యపోయారు.
హిట్లర్‌ను బెదిరించేందుకు అణుబాంబు..
హార్వర్డ్‌లో రసాయనశాస్త్రం చదివిన హైమర్.. ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగి భూగర్భశాస్త్రంపై దృష్టిపెట్టాడు. అనంతరం ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ కేంబ్రిడ్జ్‌లో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు రూథర్‌ఫర్డ్, నీల్స్‌బోర్‌ల పర్యవేక్షణలో పరిశోధనలు జరిపాడు. కొన్నాళ్లకు అమెరికాకు తిరిగొచ్చి కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా చేరాడు. అప్పుడే యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది.
జర్మన్ నియంత హిట్లర్ అణుబాంబును తయారుచేస్తాడేమోనని అమెరికా అనుమానించింది. ఆయన కన్నా ముందే దాన్ని ఒక హెచ్చరికగా రూపొందించాలనుకుంది. అప్పటికే హైమర్ న్యూక్లియర్ సైన్సులో పరిశోధనలు ప్రారంభించాడు. దీంతో ఆయనను అమెరికా ప్రభుత్వం అణుబాంబు తయారీకై ‘మన్ హటన్ ప్రాజెక్టు’కు డైరెక్టరుగా నియమించింది. హైమర్ వివిధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో కలిపి 4,500మంది నిపుణులతో అణుబాంబును తయారు చేశాడు. న్యూమెక్సికోలో ఓ ఎడారిలో తొలి అణుబాంబును పరీక్షించారు. అప్పుడు వెలువడిన కాంతిని చూసి ‘ఒకేసారి వేయి సూర్యుల కాంతి ఆకాశంలోకి ప్రసరిస్తే ఎంతో.. అంత దేదీప్యమానమైనది నా తేజస్సు’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటల్ని హైమర్ సంస్కృతంలో చెప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారట..!
వినాశనానికి చలించి..
తన పర్యవేక్షణలో తయారైన అణుబాంబు జపానులోని హిరోషిమా, నాగసాకిలపై ప్రయోగించినప్పుడు జరిగిన ప్రాణనష్టానికి హైమర్ ఎంతగానో చలించిపోయారు. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఆయనకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేసిన సమయంలో ‘నా చేతులు రక్తసిక్తమయ్యాయి. ఇకపై అణ్వస్త్రాల్ని తయారుచేయడానికి నేను వ్యతిరేకిని’ అని అందరి ముందు చెప్పారు. ఆ తర్వాతి కాలంలో అణ్వస్త్రాల నిషేధంపై ఆయన గళమెత్తారు. దీంతో 1954లో అమెరికా ప్రభుత్వం ఆయనపై పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయనకు సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేయడంతో పాటు విధానపరమైన నిర్ణయాల కమిటీల నుంచి ఆయనను తొలగించారు. ఒకదశలో వామపక్షవాదులతో హైమర్ దంపతులకు సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి.
నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించి..
ప్రముఖ శాస్త్రవేత్త హోమీ బాబా జీవితంపై రచయిత భక్తియార్ దాదాభాయ్ రాసిన పుస్తకాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆవిష్కరించారు. ఇందులో ఓపెన్‌హైమర్-హోమీబాబా మధ్య ఉన్న స్నేహాన్ని రచయిత ప్రస్తావించారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓపెన్‌హైమర్‌ను హోమీ బాబా ఓ సారి కలిశారు. అప్పటినుంచి వారిద్దరూ స్నేహితులయ్యారు. హైమర్ సంస్కృతం కూడా నేర్చుకున్నారు. 1954లో హైమర్ అమెరికాలో భద్రతాపరమైన క్లియరెన్స్ కోల్పోయిన సమయంలో.. బాబా సూచన మేరకు అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆయన్ను భారత్‌కు ఆహ్వానించారు. భారత పౌరసత్వం కూడా ఇస్తామని నెహ్రూ ఆఫర్ చేశారు. అయితే అందుకు హైమర్ అంగీకరించలేదు. అమెరికాలో తనపై వచ్చిన అభియోగాలన్నీ అవాస్తవమని రుజువయ్యేదాకా దేశాన్ని వీడబోనని ఆయన నిశ్చయించుకున్నారు. అంతేగాక, అలా దేశం విడిచి వెళ్లిపోతే తనపై ఉన్న అనుమానాలు మరింత బలపడుతాయని ఆయన భావించారు’’ అని రచయిత ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
హైమర్‌పై కేసులు నమోదు చేసిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే 1965లో ఆయన గొంతు క్యాన్సర్ బారినపడ్డారు. కిమోథెరపీ చేయించినా తగ్గలేదు. 1967లో కోమాలో వెళ్లిన హైమర్ (63).. ఆ తర్వాత కొద్ది రోజులకే తుదిశ్వాస విడిచారు. కాగా.. కొన్ని దశాబ్దాల తర్వాత హైమర్ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దును గతేడాది అమెరికా ప్రభుత్వం తొలగించింది. ఈ సందర్భంగా మంత్రి జెన్నిఫర్ గ్రాన్‌హోం మాట్లాడుతూ.. ‘‘అప్పటి అటామిక్ ఎనర్జీ కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి హైమర్ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేసింది. హైమర్ పట్ల అన్యాయంగా, పక్షపాతంగా వ్యవహరించారని ఆ తర్వాత సాక్ష్యాధారాలతో తేలింది. దీంతో ఆయన నిజాయితి, అచంచలమైన దేశభక్తి రుజువయింది’’ అని ఆమె కొనియాడారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment