నియామకాలు నిలిపేసిన ఐటీ సంస్థలు.. ఆందోళనలో యువటెక్కీలు.. లెక్కలు చూస్తే..
ఐటీ సేవల రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత టెక్ కంపెనీలు అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. ఇటీవల టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ వంటి అగ్ర ఐటీ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాయి
గత ఏడాది త్రైమాసికంతో పోల్చితే కంపెనీలు భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్లు వెల్లడైంది. చాలా కాలం తర్వాత పరిస్థితులు కుదుటపడతాయని అందరూ భావిస్తుండగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉన్నట్లు సూచికలు హెచ్చరిస్తున్న వేళ యువటెక్కీలు ఆందోళన చెందుతున్నారు. పైగా కంపెనీలు ప్రస్తుతం ఉన్న వారికే వేతన పెంపులను ప్రస్తుతానికి వాయిదా కూడా వేశాయి.
జూన్ 2023తో ముగిసిన త్రైమాసికంలో TCS 523 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. గత ఏడాది ఇదే కాలంలో నియమకాల సంఖ్య 14,136గా ఉంది. ప్రస్తుత వ్యాపార వాతావరణంలో ఎక్కువ మంది ఉద్యోగులను చేర్చుకోవడానికి బదులుగా ప్రస్తుతమున్న ఉద్యోగుల నైపుణ్యాలను పెంచుకోవాలని కంపెనీ చూస్తున్నట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఇదే సమయంలో ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కానీ ఆన్ బోర్డింగ్ ఆలస్యం కొనసాగుతోంది. జూన్ చివరి నాటికి TCSలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,15,318గా ఉంది. ఇక టెక్ దిగ్గజం విప్రో విషయానికి వస్తే జూన్ త్రైమాసికంలో హెడ్ కౌంట్ 8,812 తగ్గినట్లు వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపనీ 15,446 మంది ఉద్యోగులను చేర్చుకుంది. అలాగే రాబోయే త్రైమాసికాల్లో కీలకమైన ప్రాంతాలకు మాత్రమే ఉద్యోగాలను తీసుకుంటామని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఏఐ, డేటా, భద్రత, ఇంజనీరింగ్ వంటి కీలక సాంకేతికలపై పెట్టుబడులు పెడుతోంది.
ఇక టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న HCLTech ఉద్యోగుల సంఖ్య జూన్ త్రైమాసికంలో 2506 మేర పడిపోయింది. ఈ క్రమంలో సీనియర్ ఉద్యోగుల వార్షిక జీతాల పెంపును వాయిదా వేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక జూనియర్ల విషయానికి వస్తే అక్టోబరులో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రతీక్ అగర్వాల్ వెల్లడించారు. చివరగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ జూలై త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 7000 పడిపోయింది. ప్రస్తుతం కంపెనీలో మెుత్తం 3,36,294 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించింది. అలాగే రాబోయే త్రైమాసికాల్లో తమ AI సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తామని CEO సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. 80 యాక్టివ్ క్లయింట్ ప్రాజెక్ట్‌లతో జనరేటివ్ AI సామర్థ్యాలు బాగా విస్తరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు మాస్ హైరింగ్ జోలికి వెళ్లవని టెక్ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో యువటెక్కీలు ఆందోళన చెందుతున్నారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment