Facts About Sitamarhi Sita Temple:
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్. సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలా మందికి తెలియదు. మరి అదెక్కడుంది? ఆ ప్రాంత విశేషాలేమిటి వంటివి చూద్దామా ..!
ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని 'సీత సమాహిత్ స్థల్' అని 'సీత మారి' అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో చూడటానికి ఒకేఒక గుడి ఉన్నది.
బహుశా ..! దీన్ని చూస్తే గుడి అని అనిపించదేమో! ... స్మారకం అనాలేమో ..!! తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు 'సీతా కేశ వాటిక' ను పాడు చెయకుండ అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసము ఉన్నది ఇక్కడే.
ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమను చూస్తుంటే ... ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు.
సీతా సమాహిత్ స్థల్ కి బస్సు మార్గం చక్కగా ఉంటుంది. అలహాబాద్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో, వారణాసి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్య క్షేత్రం. రైళ్లలో వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి (ఏది దగ్గర అనుకుంటే అది) రైల్వే స్టేషన్లో దిగి సీతా సమాహిత్ స్థల్ చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి విమానాశ్రయాలకు చేరుకొని క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment