Breaking

Search Here

24 September 2023

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు: 'స్నేహశీలి, సెన్సిబుల్ నటుడు అక్కినేని'

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు: 'స్నేహశీలి, సెన్సిబుల్ నటుడు అక్కినేని'

అలనాటి హీరో అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయమున్న నాలాంటి సామాన్యులు ఎందరో.

ఆయన స్నేహశీలి. మాటకారి. సాంస్కృతిక సంస్థలవారినీ, మీడియా వారినీ, అందరినీ చక్కగా గుర్తుపట్టి పలకరించి, వారిని ఆనందపరిచేవారు. వారిని స్మరించుకునే చక్కని ఘట్టాలు అందరి జీవితాల్లోనూ ఉండే వుంటాయి. అలాంటివే నా జీవితంలోనూ.

1991 చివరి రోజుల్లో అనుకుంటా. ఒకరోజు ఉదయం నేను తెలుగు యూనివర్సిటీకి వెళ్ల‍డానికి తయారవుతున్నపుడు ఫోన్ మోగింది. బస్టాండుకు పావుగంట నడక, ఆ తర్వాత బస్ దొరకడం, 35 నిమిషాల ప్రయాణం – తరగతికి హాజరై పాఠం చెప్పడం.

వంట, పిల్లల తయారీల తర్వాత హడావిడిగా వెళ్తున్న తరుణంలో. ల్యాండ్ లైన్ మోగింది. ఫోన్ ఎత్తి విసుగ్గా ‘ఎవరండీ’ అన్నాను. ‘నాగేశ్వరరావునండీ’ అన్నారు. ఇంకాస్త విసుగ్గా ‘ఏ నాగేశ్వరరావండీ’ అన్నాను. ‘ఏ నాగేశ్వరరావునేనండీ. అక్కినేని నాగేశ్వరరావంటారు నన్ను’ అన్నారు.

ఇక నా మనఃస్థితిని ఊహించుకోవచ్చు. ఓ నాలుగు సారీలు చెప్పాను. ఆయన నాకు ఫోన్ చెయ్యడమేమిటని ఆశ్చర్యపోతూ. నా క్షమాపణలను నవ్వుతో స్వీకరిస్తూ ‘తప్పేం లేదండీ. నేను పనిలేనివాణ్ణీ. మీకు లక్ష పనులుంటాయి’ అన్నారు. అదీ మా ఇద్దరి మధ్యా తొలి వ్యక్తిగత సంభాషణ.

అంతకు కొన్ని వారాల ముందే వారిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చిన సందర్భంగా దూరదర్శన్ కోసం ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ కూడా మరపురాని అనుభవమే.

షూటింగ్ మొదలవుతూండగా, ‘మీకింత మేకప్ అవసరం లేదు. తుడుచుకోండి’ అని తన కర్చీఫ్ నా చేతికిచ్చారు అక్కినేని. తుడిచేసుకున్నాక, దానిని తిరిగి ఆయనకివ్వడం బాగుండదని నా బ్యాగ్‌లో పెట్టుకుంటూంటే, ‘నా కర్చీఫ్ తీసేసుకుందామనే’ అని దబాయిస్తూ, తీసుకుని తన జేబులో పెట్టుకున్న అక్కినేని. నా ప్రశ్నలన్నిటికీ చాలా ఉల్లాసంగా, నొచ్చుకోకుండా, అభిమానంగా సమాధానాలు చెప్పారు!

అక్కినేని పేరిట జాతీయ పురస్కారాలు ఆరంభించారు (2006 అనుకుంటా). మొదటిది దేవానంద్‌కి ఇచ్చారు. ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘నా తొలి అవార్డు దేవానంద్‌కి ఇస్తున్నాను. సభ ఇంగ్లిష్‌లో జరగాల్సి ఉంటుంది. కనీసం దేవానంద్ గురించి ఇంగ్లిష్‌లో చెప్పాల్సి ఉంటుంది. మీరైతే బాగుంటుందని అనుకుంటున్నాను’ అన్నారు.

నేను ఆశ్చర్యం నుంచి కోలుకోలేక మాట్లాడలేదు ఓ క్షణం. ఆయనకు అనుమానం వచ్చినట్టుంది. ‘మీకు అసలు దేవానంద్ గురించి తెలుసా?’ అన్నారు. నేను చూసేదే హిందీ సినిమాలని చెప్తే బాధపడతారేమోనని అనలేదు గానీ, దేవానంద్ సినిమాలు చాలా వరకు చూశానని చెప్పాను. అలా అక్కినేని తొలి జాతీయ అవార్డు సభలో దేవానంద్ గురించి నేను మాట్లాడ్డం, దేవానంద్ నా దగ్గరికి వచ్చి అభినందించి, ‘థాంక్యూ యంగ్ లేడీ. యూ ష్యూర్‌లీ నో ఎ లాట్ ఎబౌట్ మీ’ అని చెప్పడం అక్కినేని వారి వల్ల నాకు మిగిలిన మరో మధురస్మృతి.

నేను వరల్డ్ స్పేస్‌లో పని చేస్తున్నపుడు అక్కినేనిని ఎన్ని ఇంటర్వ్యూలు అడిగానో లెక్కేలేదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వెళ్లి మా స్టూడియోకు ఇంటర్వ్యూకి తీసుకువచ్చాను. నాది మామూలు మారుతీ జెన్ కారు. అందులో వారిని తీసుకురావడం ఇష్టం లేక, ఆయనకు మరో పెద్ద కారు బుక్ చేశాను.

నేను ఆయన ఇంటికి ముందుగా వెళ్లాను. ఆ కారు ఇంకా రాలేదు. ఆయన బయటకు వచ్చి 'పదండి వెళ్దాం' అన్నారు. 'సర్ మీకు మరో కారు వస్తుందండీ. ఈ చిన్నకారు నాది. మీది కూడా వచ్చాక బయల్దేరదాం' అన్నాను. 'ఆ పెద్ద కారులో మృణాళినిగారుండరుగా... ఇందులోనే వస్తాను. అది కేన్సిల్ చెయ్యండి' అని నా కారులోనే వచ్చారు.

ఇంటర్వ్యూలో నేనడిగిన ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పినా, మధ్యలో కాఫీ తాగుతున్నపుడు ఇంకెన్నో విశేషాలు చెప్పేవారు. వాటిలో కొన్ని చెప్పి ‘ప్రసారం చెయ్యకూడనివి సుమా’ అని నన్ను హెచ్చరించేవారు. అలాగే సావిత్రినీ, బి.సరోజనీ, భానుమతినీ అనుకరిస్తూ నవ్వించేవారు.

వరల్డ్ స్పేస్ రేడియోలో చిత్రకుటీరం అనే కార్యక్రమం ప్రారంభించి, నిర్మాణ సంస్థల గురించి ఎస్వీ రామారావుని ప్రతివారం సమర్పించమని అడిగాను. అందులో భాగంగా పాత నిర్మాణ సంస్థలన్నింటికీ అక్కినేనిని ఇంటర్వ్యూలు చెయ్యాల్సి వచ్చేది.

ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. ఎన్నిసార్లు రికార్డర్ పట్టుకుని ఇంటికి వెళ్లినా, ఎన్ని ప్రశ్నలడిగినా అస్సలు అసహనం చూపేవారు కాదు. ఓపిగ్గా చెప్పడమే కాక, నాకు కాఫీ ఇచ్చి మరీ పంపేవారు. అలా వరల్డ్ స్పేస్ రేడియోలో మా కార్యక్రమాలు రక్తి కట్టడానికి, పది మంది ప్రశంసలు పొందడానికి అక్కినేని సహకారమెంతో ఉంది.

అక్కినేని సతీమణి అన్నపూర్ణ మరణానంతరం, వెంటనే వెళ్తే జనంలో ఆయనతో మాట్లాడలేనని, ఆయన్ని పలకరించడానికి కొన్ని రోజుల తర్వాత వెళ్లాను. ఆయన తీరిగ్గా ఉన్నారు. చాలా సేపు మాట్లాడారు. ఈసారి సినిమాలు కాదు. ఆయన భార్య అన్నపూర్ణ గురించే. తన కుటుంబం గురించే. యథాలాపంగా నా గురించి అడిగారు.

అప్పటికి రెండు దశాబ్దాల పరిచయం ఉన్నా, ఎప్పుడూ ఆయన నన్ను వ్యక్తిగత ప్రశ్నలు అడిగింది లేదు. నేను చెప్పిందీ లేదు. ఆ రోజున ఎందుకో అడిగారు. క్లుప్తంగా చెప్పాను. నా మాటలు పూర్తికాగానే, షేక్ హ్యాండిచ్చి ‘యు ఆర్ ఏ స్ట్రాంగ్ లేడీ. ఐ అడ్మైర్ యు' అన్నారు. ఎన్నోసార్లు కలుసుకున్నాం. ఎప్పుడూ ఆయన తన సమానురాలిగా, స్నేహితురాలిగానే చూశారు.

ఆయన మరణించినపుడు ఆ గుంపులో భౌతికకాయం దగ్గరికి వెళ్లగలనో లేదో అనుకుంటూనే, ఉండలేక వెళ్లాను. అమల నన్ను గుర్తుపట్టారు కనక, ఆమె పుణ్యమాని దగ్గరగా వెళ్లి వీడ్కోలు చెప్పగలిగాను.

నటుడిగా ఆయన గురించి చెప్పాలంటే, నాకు పౌరాణికాల్లో ఎన్టీ రామారావు. సాంఘికాల్లో నాగేశ్వరరావు నచ్చేవారు. ఇప్పటికీ నచ్చుతారు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

మన తొలి తరం తెలుగు నటులందరూ మొదట నాటకాల్లో నటించినవారే. అంటే, ఎలుగెత్తి డైలాగులు చెప్పినవారే. చేతులను విపరీతంగా కదిలిస్తూ అభినయించినవారే. అంటే, ఆంగికం, వాచికం రెండూ గట్టిగా చేసేవారు.

అక్కినేని కూడా ఆ సంప్రదాయం నుంచి వచ్చిన నటుడే. అందులోనూ ఆడవేషాలు వేసిన అనుభవంతో చలనచిత్రాల్లో నాయకుడైన అపురూపమైన జీవితం ఆయనది. కానీ, సినిమా నటనకు, నాటకరంగ నటనకు ఉన్న తేడాను ఆయన పట్టుకున్నంత వేగంగా మరో నటుడు పట్టుకోలేదని నాకనిపిస్తుంది.

సినిమాల్లో అరవనక్కరలేదు. చేతులు ఎడాపెడా ఊపనక్కరలేదు. నాటకాల్లో అది తప్పదు. అయిదో వరసలో ఉన్న ప్రేక్షకుడికి కూడా కనిపించాలి, వినిపించాలి కనక. సినిమాకు సాత్వికాభినయం అన్నిటికంటే ముఖ్యం. అది అక్కినేని చాలా త్వరగానే గ్రహించారు.

ఆయనకు నటనాకళపై ఉన్న అవగాహన నాకు ఎంతో నచ్చే విషయం. నాగేశ్వరరావు కాలంలో నటన గురించిన పాఠశాలలూ, బోధనలూ లేవు. కేవలం అనుభవంతో, స్వీయజ్ఞానంతో నేర్చుకున్న గొప్పతరం అది. వారందరిలోనూ అక్కినేని ప్రత్యేకం.

ఇక, అక్కినేని నాగేశ్వరరావు నటనలో ప్రత్యేకత ఏమిటి? పైన చెప్పుకున్నట్టు సినిమా నటన స్వరూపాన్ని చాలా త్వరగా అర్థం చేసుకోవడం ఒకటి. దీని నుంచే తక్కిన లక్షణాలూ వస్తాయి. కళ అంటేనే వాస్తవికతాభ్రాంతిని కలిగించేదే తప్ప, వాస్తవికత కాదు. దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న నటుడు అక్కినేని.

అందుకే ఆయన పాత్రలో లీనమైనట్టు కనిపిస్తారే తప్ప, నిజంగా లీనం కారు. తను అప్పటిదాకా అభినయించిన పాత్ర భావోద్వేగాల నుంచి తేలిగ్గా బయటపడగలరు. కొందరు నటులు పాత్రల్లో లీనమైపోయి, షూటింగ్ తర్వాత కూడా మామూలు మనఃస్థితి చేరుకోలేకపోవడం అక్కినేని కాలంలో జరిగేది. కానీ, ఆయనలో ఆ లక్షణాలే లేవు.

తను నటించిన పాత్రల ద్వారా ప్రపంచజ్ఞానాన్ని ఆయన పెంచుకున్నారు. కొత్త విషయాలెన్నో తెలుసుకున్నారు. తను ఒక నటుడిని మాత్రమే కానీ, తను విప్రనారాయణో, సురేంద్రబాబో, డాక్టర్ చక్రవర్తో, దేవదాసో, నారదుడో, కాళిదాసో, జయదేవుడో కాడన్న స్పృహ ఆయనను నటిస్తున్నప్పుడు కూడా వీడలేదు. ఈ ఎరుక ఉండడం మామూలు విషయం కాదు.

నటనను నటనగా సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు కనకే, తను నాస్తికుడై ఉండీ, భక్తిపాత్రలను అంత గొప్పగా పోషించగలిగారు. తను నిజంగా అసాధారణ భక్తుడినని ప్రేక్షకులను నమ్మించగలిగారు. అలాగే, ఒక్క పెగ్గూ తాగకుండా దేవదాసును మన కళ్లముందు సాక్షాత్కరింపజేయగలిగారు.

నటుడిగా ఆయనలో ఉన్న మరో గొప్పగుణం, తన పరిమితులు తెలిసి ఉండడం. ఏ పాత్ర తను వేస్తే బాగుంటుందో, ఏది తనకు నప్పదో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే, ఆయనకు ప్రేక్షకులే పరమప్రమాణం.

ఏది చేసినా, ప్రేక్షకుల మెప్పును పొందుతానా, ప్రేక్షకులు తనని ఈ పాత్రలో ఆమోదిస్తారా అని ఆలోచించారే తప్ప, తన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఏ పాత్రనైనా తను చెయ్యగలనని అనుకోలేదు. ఆ కారణంగానే పౌరాణిక పాత్రలు కొన్నింటిని తిరస్కరించారు.

అంతమాత్రాన ఆయన సవాళ్లను స్వీకరించలేదని కాదు. దానికి మంచి ఉదాహరణే ‘మిస్సమ్మ’ లో రెండో ప్రాధాన్యం ఉన్న పాత్రను వెంటనే ఒప్పేసుకోవడం. అప్పటికే దేవదాసుతో శిఖరాగ్రం చేరుకున్న తను, మిస్సమ్మలో రెండో స్థాయి పాత్రను ఎందుకు ఒప్పుకున్నట్టు? తన నటనపై తనకున్న విశ్వాసంతోనే. తను విషాదపాత్రలతో సరిసమానంగా హాస్యపాత్రను కూడా రక్తికట్టించగలననే నమ్మకంతోనే.

అతిగా నటించడం అక్కినేని లక్షణం కాదు. ఆయన నటనలో పాత్ర ఔచిత్యం ఎక్కడా దెబ్బతినదు. పాత్రను అర్థం చేసుకోవడంలో దిట్ట కనకే ఆయన నవలానాయకుడిగా అంత సులువుగా ఒదిగిపోయారు. ఆయనే పదేపదే చెప్పుకున్నట్టు, నిజంగా తనది హీరో పర్సనాలిటీ కాదు. కానీ ఎప్పుడూ మన కళ్లలో హీరోగానే ఉంటారు. కళ్లతో నటించడం అనే కళను కరతలామలకం చేసుకున్న నటుడాయన.

సన్నివేశాన్ని బట్టి, పాత్ర మనఃస్థితిని బట్టి ఆ కళ్లలో చిలిపితనం, విషాదం, వైరాగ్యం, తీక్ష్ణత, సౌమ్యత, ఆగ్రహం, అమాయకత్వం అన్నీ అద్భుతంగా వ్యక్తమవుతాయి. అలాంటి మంచి నటుడితో కొద్దిపాటి స్నేహమైనా దొరకడం నా అదృష్టమే.




No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments