Breaking

Search Here

24 September 2023

ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ‘నిద్ర’ లేవకపోతే ఏమవుతుంది? వాటి ‘రహస్యాలను’ ఇతర దేశాలు తెలుసుకుంటాయా?

ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ‘నిద్ర’ లేవకపోతే ఏమవుతుంది? వాటి ‘రహస్యాలను’ ఇతర దేశాలు తెలుసుకుంటాయా?

చంద్రుడిపై ఉన్న చంద్రయాన్- 3 విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కమ్యూనికేషన్‌ కోసం ప్రయత్నించామని, కానీ వాటి నుంచి సిగ్నల్స్ అందలేని ఇస్రో తెలిపింది.

ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగింది. విక్రమ్ ల్యాండర్, అందులోని రోవర్‌ జీవిత కాలం 14 రోజులే.

చంద్రుడి ఉపరితలంపై ఒక రోజు (లూనార్ డే) అంటే భూమిపై సుమారు 28 రోజులతో సమానం. అంటే చంద్రుని మీద సుమారు 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది.

ఆగస్టు 23న చంద్రుడి మీద పగలు మొదలైంది. అందుకే ఇస్రో ఆ రోజు ల్యాండర్‌ను దించింది. చంద్రుని మీద పగలు పూర్తి కానున్న నేపథ్యంలో సెప్టెంబరు 4న ల్యాండర్, రోవర్లను స్లీప్ మోడ్‌లోకి ఇస్రో పంపింది.

శుక్రవారం నాడు (సెప్టెంబర్ 22) విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రలేపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ, వాటి నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదని, వాటితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు.

ల్యాండర్, రోవర్ పని చేయడానికి విద్యుత్ కావాలి. చంద్రుని మీద సూర్యకాంతి ఉంటేనే సోలార్ ప్యానెల్స్ ద్వారా వాటికి విద్యుత్ అందుతుంది. కానీ రాత్రి మొదలైంది కాబట్టి వాటికి విద్యుత్ అందదు.

చంద్రుని మీద రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకారం అప్పుడు ఉష్ణోగ్రత మైనస్ 130 డిగ్రీల వరకు పడిపోతుంది. కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకంగా మైనస్ 253 డిగ్రీలకు చేరుతుంది.


ఇంత కనిష్ఠ ఉష్ణోగ్రతల వద్ద రోవర్, ల్యాండర్లు రెండూ గడ్డకట్టుకుపోతాయి.

మళ్లీ సెప్టెంబర్ 22న చంద్రుని దక్షిణ ధ్రువం ప్రాంతంలో ఎండ పడింది. ఇప్పుడు అవి మళ్లీ పని చేయడమనేది సవాలుతో కూడుకున్నది.

‘‘రాత్రి పూట చంద్రుని మీద ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల కంటే దిగువకు పడిపోతాయి. అలాంటి వాతావరణంలో బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు చెడిపోకుండా ఉంటాయని కచ్చితంగా చెప్పలేం. కానీ వాటికి కొన్ని పరీక్షలు నిర్వహించాం. కాబట్టి విక్రమ్, ప్రజ్ఞాన్ ఆ కఠిన వాతావారణాన్ని తట్టుకొని మళ్లీ పని చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నాం’’ అని ఇస్రో చీఫ్ సోమనాథ్ గతంలో మీడియాతో చెప్పారు.


విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు రాకపోతే ఎలా?

ల్యాండర్, రోవర్ యాక్టివేట్ అయితే గతంలో మాదిరిగానే చంద్రుని మీద మరింత సమాచారం సేకరించి భూమికి పంపుతాయి. లేదంటే ‘భారత రాయబారి’గా అక్కడే శాశ్వతంగా ఉండిపోతాయని ఇస్రో తెలిపింది.

యాక్టివేట్ కాకపోతే ల్యాండర్, రోవర్ల పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో మళ్లీ పని చేసే అవకాశాలున్నాయా, చంద్రుడి మీదకు వెళ్లే ఇతర దేశాల రోవర్లు ‘ప్రజ్ఞాన్’ నుంచి ఏదైనా రహస్య సమాచారం సేకరిస్తాయా లాంటి ప్రశ్నలు ఎన్నో వినిపిస్తున్నాయి.

వీటికి సమాధానాలు తెలుసుకునేందుకు, ఆంధ్రా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగంలో స్పేస్ ఫిజిక్స్ బోధించే ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాసరావుతో బీబీసీ మాట్లాడింది.


‘జియో స్పియర్-బయో స్పియర్’ అనే ఇస్రో ప్రాజెక్టు కోసం ఆంధ్రా యూనివర్సీటీ తరపున ఆరేళ్ల నుంచి శ్రీనివాసరావు పని చేస్తున్నారు. చంద్రయాన్-3కి సంబంధించి వివిధ అంశాలను విశ్లేషించేందుకు ఇస్రో సంప్రదించే భౌతిక శాస్త్ర నిపుణుల బృందంలో శ్రీనివాసరావు కూడా ఒకరు. ఆయన ఇలా సమాధానాలు ఇచ్చారు.


ల్యాండర్, రోవర్లను తిరిగి భూమికి తీసుకు రాలేమా?

అంతరిక్ష పరిశోధనలు చేసే ఏ దేశమైనా ప్రయోగించే రోవర్లు వంటి పరికరాలను ‘వన్ వే మిషన్స్’ అంటే ఒక సారి అంతరిక్షంలోకి పంపి వాటిని సమాచారం సేకరించడం కోసమే

వినియోగిస్తాయి. వాటిని మళ్లీ మళ్లీ వినియోగించుకోవాలని, తిరిగి భూమి మీదకు తీసుకుని రావాలని అనుకోవు. ఎందుకంటే అంతరిక్షంలోకి పంపిన రోవర్లను తిరిగి భూమికి తీసుకుని రావడానికి అయ్యే ఖర్చుతో పోలీస్తే, మరో మిషన్‌ను చేపట్టడం ఉత్తమం.


మళ్లీ పని చేయకపోతే ల్యాండర్, రోవర్ ఏమవుతాయి?

రోవర్, ల్యాండర్లపై సూర్యకాంతి పడిన తర్వాత అవి పని చేయకపోతే ఇక అవి శాశ్వతంగా పని చేయనట్లే.

ఎందుకంటే వాటిని తయారు చేసినప్పుడే వాటి జీవిత కాలాన్ని 14 రోజుల కోసమే డిజైన్ చేశారు.

అలా పని చేయని ల్యాండర్, రోవర్లు చంద్రుడి ఉపరితలం మీద వ్యర్థపదార్థాలుగా పడి ఉండటం తప్ప, వాటితో ఏ ఉపయోగం ఉండదు.


భవిష్యత్తులో మళ్లీ యాక్టివేట్ అవుతాయా?

వాటిని తిరిగి యాక్టివేట్ చేయలేరు. ఆ దిశగా ప్రయోగాలు కానీ అలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడం కానీ ఇంత వరకు జరగలేదు.

కాకపోతే భవిష్యత్తులో మరో రోవర్ లేదా ఏదైనా యూనిట్‌ను పంపి అక్కడ ఉన్న రోవర్లను యాక్టివేట్ చేసేందుకు జరపాల్సిన ప్రయోగాలు ఇంకా ఆలోచన దశలోనే ఉన్నాయి.

అది జరిగితే మన బండి పాడైపోతే మెకానిక్ దగ్గరకు తీసుకుని వెళ్లి బాగు చేసుయించుకుని తిరిగి వాడుకున్నట్లే రోవర్లను మళ్లీ వాడుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి రావాలంటే సమయం పడుతుంది.


ప్రజ్ఞాన్ రోవర్ ఏమైనా సమాచారం ఇస్తుందా?

చంద్రుడి ఉపరితలంపై పని చేయకుండా ఉండే రోవర్, ల్యాండర్ చంద్రుడిపై వ్యర్థాల కిందే లెక్క.

అక్కడి వాతావరణాన్ని తట్టుకుని ఉండటం కష్టమే. పని చేయని వాటి నుంచి ఏ సమాచారమూ సేకరించలేం.

ఎందుకంటే చంద్రుడిపై ఉన్న వాతావరణంలో ఒకసారి ఏదైనా వస్తువు పనికిరాకుండా పోతే అది శాశ్వతంగా డెడ్ అయిపోయినట్లే.


చంద్రుని మీదకు వెళ్లే విదేశీ రోవర్లు ప్రజ్ఞాన్ నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తాయా?

భవిష్యత్తులో మరే దేశమైనా చంద్రుడి మీద ప్రయోగాల కోసం ల్యాండర్లు, రోవర్లు వంటివి పంపాయని అనుకుందాం. అలా వెళ్లే విదేశీ రోవర్లకు, ప్రస్తుతం అక్కడున్న ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి ఆటంకం ఉండదు. పైగా, ప్రజ్ఞాన్ రోవర్‌ను అవి ఉపయోగించుకోలేవు కూడా.

చంద్రుని మీదకు వెళ్లిన విదేశీ రోవర్లు, ఇతర యూనిట్లు ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం మీద ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ నుంచి రహస్య సమాచారం సేకరించే అవకాశం లేదు.

ఎందుకంటే ఏ దేశమైనా తమ దేశం తరపున అంతరిక్షంలోకి రోవర్లు, ఇతర యూనిట్లను ప్రయోగించేటప్పుడు వాటి వివరాలను దాదాపుగా అందరికి తెలియజేస్తాయి. వాటి నుంచి కొత్తగా సేకరించే సమాచారం ఏమీ ఉండదు.

రోవర్లు సేకరించి మనకు పంపే సమాచారమే విలువైనదిగా ఉంటుంది. అంతే కానీ ఆ పరికరాల్లో ఏ రహస్యం ఉండదు. తయారు చేసేటప్పుడే వాటి జీవితకాలాన్ని నిర్దేశిస్తారు కాబట్టి, వాటి ద్వారా తర్వాత కాలంలో ఎలాంటి సమాచారమూ పొందలేరు.




No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments