Breaking

Search Here

04 December 2021

Omicron Scare: ఆ ప్రయాణికుల జాడ దొరికేదెలా..?


 
Omicron Scare: ఆ ప్రయాణికుల జాడ దొరికేదెలా..?

దిల్లీ: 

కరోనా ఒమిక్రాన్ రూపంలో కొత్త అవతారం ఎత్తడంతో.. ప్రపంచ మొత్తం మళ్లీ ఆంక్షల ఛట్రంలోకి జారుకుంటోంది. ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్.. భారత్‌లోనూ వెలుగుచూసింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన పలువురు కరోనా బారిన పడటంతో ఈ రకం కేసులు మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఈ క్రమంలో వేరే దేశాల నుంచి భారత్‌లో దిగిన కొందరి ఆచూకీ అధికారులకు చిక్కకపోవడం ఇప్పుడు సమస్యగా మారింది. వారు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 విదేశాల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకున్న 300 మంది ప్రయాణికుల్లో ఇప్పుడు 13 మంది జాడ తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారింది. వారు తప్పుడు చిరునామా, ఫోన్‌ నంబర్లు ఇవ్వడమే ఈ పరిస్థితికి కారణం. ఆ 13 మందిలో ఏడుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వారిని గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.


దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళ క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించడంతో చండీగఢ్‌ యంత్రాంగం కేసు నమోదు చేసింది. బుధవారం విమానాశ్రయంలో దిగిన ఆమెకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. ఒక వారం పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆమెను అధికారులు ఆదేశించారు. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లకుండా.. హోటల్‌కు వెళ్లడంతో కేసు నమోదైంది.


బెంగళూరులో దాదాపు 10 మంది ప్రయాణికుల జాడ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. వారంతా దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారు కావడంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 30 మంది జాడ కోసం వెతుకుతున్నారు.


దిల్లీలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో 12 మంది ఒమిక్రాన్ అనుమానితులు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వారంతా ముప్పు జాబితాలోని దేశాల నుంచి ఇటీవలే భారత్‌కు చేరుకున్నారు. అందులో 8 మందికి ఇప్పటికే కరోనా నిర్ధారణ అయింది. మిగతావారు గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. అలాగే.. ఒక చిన్నారితో సహా చెన్నైకి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారు ముప్పు ఉన్న దేశాల నుంచి ఇక్కడకు చేరుకున్నారు. జైపూర్‌లో ఓ కుటుంబంలో 9 మందికి కరోనా సోకింది. వారిలో నలుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. దిల్లీ, ముంబయి, చండీగఢ్‌లో ఈ వారం విదేశాల నుంచి వచ్చిన వారిలో దాదాపు 18 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరంతా ఆ దేశాల నుంచి భారత్‌కు చేరుకోవడంతో.. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.



No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments