Chandrababu: ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు: సీఎం చంద్రబాబు |
Chandrababu: ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
ఏపీలో విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
హైదరాబాద్: ఏపీలో విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణ గడ్డపై తెదేపాకు పునర్ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.
‘‘ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. ఏపీలో విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఆయన. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదు. తెలుగుజాతి ఉన్నంతవరకు తెదేపా జెండా రెపరెపలాడుతుంది. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చాం. నన్ను జైల్లో పెట్టినపుడు తెదేపా శ్రేణులు చూపించిన చొరవ మరువలేను. ప్రపంచంలోని చాలా దేశాల్లో నా అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మరిచిపోలేను. హైదరాబాద్‌లో నాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలను టీవీలో చూసి గర్వపడ్డా.
నాలెడ్జి ఎకానమీకి తెదేపా హయాంలో నాంది పలికాం. నా తర్వాత కాంగ్రెస్, భారాస అభివృద్ధిని కొనసాగించాయి. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాను. దాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు. ఆయనకు మరోసారి కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరముంది. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. ఏపీ, తెలంగాణ అభివృద్ధే తెదేపా ధ్యేయం. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువ. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం. 2019 తర్వాత ఏపీలో విధ్వంస ప్రభుత్వం వచ్చింది. విభజన కంటే వైకాపా పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ.
యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలు ప్రాచుర్యం పొందాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి 70 రైళ్లలో ప్రజలు తరలివచ్చారు. రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని ఎన్‌ఆర్‌ఐలు వచ్చారు. అందరూ ఓటు వేయడంతో ఏపీ ఎన్నికల్లో సునామీ వచ్చింది. గతంలో ఏపీలో ఉన్న భూతాన్ని చూసి కంపెనీలు రాలేదు. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కృషి చేస్తా’’ అని చంద్రబాబు తెలిపారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment