Search Here

12 November 2014

Tomato Price: మెక్‌డొనాల్డ్స్‌ను తాకిన టమాటా సెగ.. స్టోర్‌ ముందు నోటీస్‌!



దేశంలోని పెద్ద పెద్ద రెస్టారెంట్‌లకు సైతం టమాటా (Tomato) సెగ తాకుతోంది. తాజాగా దిల్లీలోని కొన్ని మెక్‌డొనాల్డ్స్ (McDonald's) స్టోర్లు టమాటా లేకుండానే బర్గర్లను అందివ్వనున్నట్లు ప్రకటించాయి.

దిల్లీ: దేశవ్యాప్తంగా టమాటా ధర (Tomato Price) అంతకంతకు పెరుగుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో దీని ధర రూ.250కి చేరింది. దీంతో వంటింటికి వాటిని తీసుకురావాలంటేనే సామాన్యులు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్‌లు టమాటాలు లేకుండా తమ వంటకాలను సరఫరా చేస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరుతున్నాయి. తాజాగా దిల్లీలోని మెక్‌డొనాల్డ్స్‌ (McDonald's) స్టోర్‌ ముందు ఉంచిన నోటీస్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మార్కెట్‌లో నాణ్యమైన టమాటాలు అందుబాటులో లేని కారణంగా బర్గర్లను టమాటా లేకుండా అందివ్వనున్నట్లు నోటీస్‌లో పేర్కొంది. దీన్ని ఆదిత్య షా అనే ట్విటర్‌ యూజర్‌ తన ఖాతాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే, ధరల పెరుగుదల కారణంగానే మెక్‌డొనాల్డ్స్‌ వీటిని వినియోగించడం లేదని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేశారు.

మరోవైపు మెక్‌డొనాల్డ్స్‌ ఉత్పత్తుల్లో టమాటాలను వినియోగించకపోవడంపై మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా అధికార ప్రతినిధి స్పందించారు. ‘‘బర్గర్‌ వంటి ఉత్పత్తుల్లో టమాటాలు లేకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే, మా ఉత్పత్తుల్లో టమాట వినియోగం ఆపడానికి ధరల పెరుగుదల కారణం కాదు. మార్కెట్లో మా సంస్థ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా టమాటాల సరఫరా లేని కారణంగా వాటిని వినియోగించడంలేదు. నాణ్యమైన టమాటాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎప్పటిలానే కొనసాగిస్తాం’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా టమాటాను అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటం, సరఫరాలో అంతరాయమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో టమాట కేజీ రూ.250కు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ధరలు మండిపోతున్నాయి. చెన్నైలో కేజీ ధర రూ. 100 నుంచి రూ. 130 ఉండగా, బెంగళూరులో కిలో టమాట ధర రూ. 101 నుంచి రూ. 121గా ఉంది. దీంతో సామాన్యులు టమాట కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments